Srimad Valmiki Ramayanam

Balakanda Chapter 23

' Rama Lakshmana follow Viswamitra -2 !'

With Sanskrit text in Telugu , Kannada and Devanagari,

కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే |
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ ||

తా||'కౌసల్యాదేవి యొక్క తనయుడైన ఓ రామా! తూర్పు దిశలో సంధ్యకాంతులు విలసిల్లు చున్నవి. ఓ నరశార్దూలా ! లెమ్ము. దైవ సంబంధమైన నిత్యకర్మలను ఆచరింపుము'.

బాలకాండ
ఇరువదిమూడవసర్గము
( కౌసల్యా సుప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్తతే అంటూ విశ్వామిత్రుని మేలుకొలుపు)

ప్రభాత సమయమున విశ్వామిత్ర మహర్షి తృణశయ్యపై పవళించి యున్న రామలక్ష్మణులతో ఇట్లు పలికెను. 'కౌసల్యాదేవి యొక్క తనయుడైన ఓ రామా! తూర్పు దిశలో సంధ్యకాంతులు విలసిల్లు చున్నవి. ఓ నరశార్దూలా ! లెమ్ము. దైవ సంబంధమైన నిత్యకర్మలను ఆచరింపుము'.

ఆ ఋషియొక్క ఉదారమైన వచనములను విని , స్నానము చేసి అర్ఘ్యప్రదానము చేసి ఆ వీరులు పరమపవిత్రమైన జపములను జపించిరి. ఈ విధముగా ప్రాతః కాల నిత్యకర్మములను చేసి , తపోధనుడైన విశ్వామిత్రునకు నమస్కరించి మిక్కిలి సంతోషముతో ప్రయాణమునకు సన్నద్ధులై నిలబడిరి.

అట్లు ప్రయాణముచేయుచున్న మహావీరులు దివ్యమైన గంగానది మరియూ సరయూనది సంగమ స్థానమును చూచిరి. ఆచట ఒక ఆశ్రమము చూచిరి. ఆ ఆశ్రమములో దివ్యతేజస్సు గల ఋషులు వేలకొలదీ సంవత్సరములు తీవ్రమైన తపస్సు ఆచరించియుండిరి. ఆ ఆశ్రమము చూచి పరమ ప్రీతితో ఆ మహాత్ముడైన విశ్వామిత్రునితో ఇట్లు పలికిరి. ' భగవన్ ! ఈ పుణ్యాశ్రమము ఎవరిది ? ఇక్కడ నివశించు మహపురుషుడు ఎవడు? ఈ విషయములను వినుటకు కుతూహలముగా నున్నది'.

వారి ఆమాటలను విని ఆ మునిపుంగవుడు చిరునవ్వుతూ, ' ఓ రామా ! ఈ ఆశ్రమము పూర్వము ఎవరిదో చెప్పెదను వినుము. సుందరమైన శరీరము కల "కందర్పుడు" అనువాడు గలడు. అతనిని పండితులు "కాముడు" అని పిలచెడివారు. ఓకప్పుడు పరమేశ్వరుడు ఇచట సమాధినిష్ఠుడై తపము ఆచరించుచుండెను. దుర్బుద్ధిఅయిన "కాముడు" ఆయన తపస్సునకు భంగము కలిగించెను. అంతట అ మహత్ముడు హుంకరించెను. ఓ రఘునందనా! కుపితుడైన ఆ శివుని కంటి మంటలకు అ దుర్మతి యొక్క అవయవములు దగ్ధమైనవి. పరమేశ్వరుని క్రోధాగ్నికి అతని శరీరమంతయూ భస్మము కాగా ఆ కాముడు అశరీరుడయ్యెను. అది మొదలుకొని అతడు అనంగుడని విఖ్యాతి పొందెను. శ్రీమంతం బగు ఆ దేశము అంగదేశము అని ప్రసిద్ధి పొందెను. ఈ ఆశ్రమమున శివుడు తపస్సు చేసినందుకు ఇది పవిత్రమైనది. ఈ మునులు శివభక్తులు ధర్మపరాయణులు. వారికి ఎట్టి పాపములు అంటవు. ఓ రామా ! పుణ్యమైన నదుల మధ్యనే ఈ రాత్రి గడుపుదము . ఓ నరోత్తమా! మనమందరమూ శుభ్రముగా స్నానాదికములను ముగించుకొని హోమకార్యములను పూర్తి చేసికొని ఈ పవిత్రమైన ఆశ్రమమున ప్రవేశింతము '. అని

వారు ఆవిధముగా సంభాషించుచుండగా ఆ ఆశ్రమమున గల మునులు తమ తప ప్రభావముచే వారి రాక నెరిగి ప్రమప్రీతితో పులకితులై అచటికి ఏతెంచిరి. ఆ మునులు విశ్వామిత్రునకు అర్ఘ్యపాద్యములను సమర్పించి పూజించిరి. అనంతరము రామలక్ష్మణులకు కూడా అట్లె సత్కరించిరి. విశ్వామిత్రుడును ఆమునులను కుశలప్రశ్నలతో ఆదరించెను. పిమ్మట వారు విశ్వామిత్రుని కథలతో రంజింప చేసిరి. వారందరునూ నియమ పూర్వకముగా సంధ్యోపాశన చేసిరి. విశ్వామిత్రుడు మరియూ ఆ రాజకుమారులు ఇద్దరూ అక్కడనే నివసించువారు అట్లే నియమనిష్ఠలతో జివించు మునులతో గూడి ఆ కామ ఆశ్రమమున రాత్రి అక్కడనే గడిపిరి.

ధర్మాత్ముడైన విశ్వామిత్ర మహాముని అప్పుడు అభిరాములగు రామలక్ష్మణులను మనోహరములైన కథలతో రంజింపచేసెను.

||ఓమ్ తత్ సత్||

కథాభి రభిరామాభిః అభిరామౌ నృపాత్మజౌ |
రమయామాస ధర్మాత్మా కౌశికో పునిపుంగవః ||

'ధర్మాత్ముడైన విశ్వామిత్ర మహాముని అప్పుడు అభిరాములగు రామలక్ష్మణులను మనోహరములైన కథలతో


|| om tat sat ||